ePaper
Saturday, June 13, 2026

భూముల మార్కెట్ విలువల నవీకరణను గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు భూముల మార్కెట్ విలువల నవీకరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

సోమవారం ఉదయాదిత్య భవనంలో సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో భూముల మార్కెట్ విలువలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

జీవో నెం.41 ప్రకారం భూముల మార్కెట్ విలువల (మార్కెట్ వాల్యూ) నవీకరణ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు అర్బన్, రూరల్ కేటగిరీలుగా విభజించి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇందుకు సంబంధించి ఫారమ్-1, 2, 3, 4ల ఆధారంగా ప్రాంతాల వారీగా రహదారులు, మండల కేంద్రాలు, నియోజకవర్గ పరిధులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల విలువలను అంచనా వేస్తున్నట్లు వివరించారు.

ల్యాండ్ విలువలను పరిశీలించిన అనంతరం ఆర్డీవో స్థాయిలో అప్లోడ్ చేసి, తరువాత మార్కెట్ విలువలను ఫైనల్ చేసి కమిటీ ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.

అర్బన్ కమిటీలో అదనపు కలెక్టర్ చైర్మన్‌గా ఉండగా, మున్సిపల్ కమిషనర్, జెడ్పీ సీఈఓ, సబ్-రిజిస్ట్రార్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. రూరల్ కమిటీలో ఆర్డీవో చైర్మన్‌గా, సబ్-రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంపీడీవో సభ్యులుగా వ్యవహరిస్తారని వివరించారు.

నాన్-అగ్రికల్చర్ ఫిజికల్ కమిటీలలో ఫారమ్-1, 2లను, అగ్రికల్చర్ కమిటీలలో ఫారమ్-3, 4లను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం అన్ని వివరాలను సరిచూసుకుని నమోదు చేయాలని సూచించారు.

అగ్రికల్చర్ భూములకు కనీస మార్కెట్ విలువ రూ.2.75 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.5 లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, దేవరకొండ ఆర్డీవో ప్రియదర్శిని, సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!