నల్లగొండ, మే 26 :
జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
పట్టణంలోని సతీష్ నగర్‌తో పాటు పలు ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసి 10 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది.
ఈ తనిఖీలు శివరాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఏడు మంది సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, నార్కోటిక్ డాగ్‌తో కలిసి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని కాలనీలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
పోలీసులు సుమారు 360 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10 మంది, బీహార్‌కు చెందిన నలుగురు, తమిళనాడుకు చెందిన ఒకరు, అస్సాంకు చెందిన ఒకరు, హర్యానాకు చెందిన ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీల్లో ఇద్దరు రౌడీషీటర్లు, ఐదుగురు ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే ఆరుగురికి గంజా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు గంజా సేవించినట్లు తేలింది. అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అధిక శబ్దం కలిగిన రెండు వాహనాలపై ప్రత్యేక కేసులు నమోదు చేస్తున్నారు. అదనంగా నాలుగు సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments