ePaper
Saturday, May 30, 2026

అర్హులైన ప్రతి మహిళ, చిన్నారికి పోషకాహారం అందాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన ప్రతి మహిళకు, చిన్నారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మహిళలు, గర్భిణీలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలోని మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు.

స్టాల్స్‌లో ప్రదర్శించిన అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన పోషకాహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చిన ఓ బాలింత మహిళకు కలెక్టర్ స్వయంగా రాగిజావ అందించారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.

మహిళా సంక్షేమం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మహిళా వారోత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో స్థానికంగా లభ్యమయ్యే తక్కువ ఖర్చుతో కూడిన పౌష్టికాహార పదార్థాలు, మిల్లెట్స్ ఆధారిత ఆహార పదార్థాలు మరియు పోషకాహార వంటకాలు ప్రదర్శించారు. అన్ని గ్రామాలలో మండల స్థాయిలో తల్లులు, తండ్రులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లతో పౌష్టికాహార వంటకాల పోటీలు నిర్వహించారు.

గర్భిణీలు మరియు బాలింతలకు గర్భధారణ సమయంలో తీసుకోవలసిన పౌష్టికాహారం, రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, ఆహార వైవిధ్యం, జంక్ ఫుడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖ సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు అనీమియా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.

కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, సీడీపీఓలు లావణ్య, నిర్మల, మమత, శ్రీదేవి, సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!