ePaper
Friday, September 4, 2026

మైనారిటీల హామీలు అమలు చేయాలి..జమియత్ ఉలేమా తెలంగాణ డిమాండ్.

చీకటి వెలుగు నల్లగొండ.

: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలేమా ఎ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ ఖాస్మీ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూమ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన మైనారిటీ సంక్షేమ హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. ఆనాటి హామీలను నెరవేర్చకుండా మైనారిటీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఎద్దేవా చేశారు. మైనారిటీ ఉప ప్రణాళికను అమలు చేసి, మైనారిటీల కోసం ప్రకటించిన రూ.4,000 కోట్ల బడ్జెట్‌ను పారదర్శకంగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఇమామ్‌లు, ముఅజ్జిన్‌ల గౌరవ వేతనాలను పెంచి సకాలంలో చెల్లించడంతో పాటు, వక్ఫ్ ఆస్తుల రక్షణకు కఠిన చర్యలు తీసుకుని వక్ఫ్ బోర్డును బలోపేతం చేయాలని కోరారు.ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి, ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యా సహాయం, కోచింగ్, హాస్టల్ సౌకర్యాలు, రాయితీ రుణాలను పునరుద్ధరించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలన్నీ విడుదల చేసి కళాశాలలకు నిధులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమియత్ ఉలేమా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా మఖ్దూమ్, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అక్బర్ ఖాన్, జిల్లా కార్యదర్శి హాఫిజ్ ఫుర్కాన్, ముఫ్తీ రియాజ్, మౌలానా జుబైర్, మౌలానా హుస్సేన్, మౌలానా సామీ, ముఫ్తీ ఉమర్, హాఫిజ్ మతీన్, ముఫ్తీ సోహైబ్, హాఫిజ్ హబీబ్, మౌలానా ఫిరాసత్, ఫైసల్, ముఫ్తీ ఘౌస్, హాఫిజ్ షంషుద్దీన్, ముఫ్తీ కలీమ్, మౌలానా అతా ఉర్ రహ్మాన్, మౌలానా ఫారూక్, జానీ, బాబా తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!