తెలంగాణ సాధన కోసం జీవితాంతం అంకితమైన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్
చీకటి వెలుగు నల్లగొండ.
తెలంగాణ ఏర్పాటే జీవిత లక్ష్యంగా పనిచేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా జయశంకర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచి పదవీ విరమణ అనంతరం వరకు తెలంగాణ అభివృద్ధి, హక్కుల కోసం ఆయన పోరాడారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పారని అన్నారు. శ్రీకాంత్ చారి వంటి అమరుల త్యాగాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ఉద్యమ నాయకుల కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని, మరో 7 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం, అధునాతన శిక్షణ కేంద్రాలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మార్చిన తర్వాత సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, అవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఇప్పటికే 700 మీటర్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. 2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేసి దేవరకొండ నుంచి బ్రాహ్మణవెల్లెంల వరకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. తద్వారా నల్గొండ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు నీరందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గినా సాగుకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఎస్‌ఎల్‌బీసీ రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీతో పాటు పాలమూరు-రంగారెడ్డి, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపినప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నెరవేరుతాయని మంత్రి అన్నారు. ప్రపంచం ఉన్నంతకాలం జయశంకర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. గద్దర్ సేవలను స్మరించుకుంటూ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. తన పాటల ద్వారా గ్రామగ్రామాన తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన గొప్ప ప్రజా గాయకుడిగా గద్దర్ నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఉప మేయర్ ఆమీర్ అలీ, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments