కులగణనపై వెనక్కి తగ్గితే దేశవ్యాప్త ఉద్యమం: జాజుల శ్రీనివాస్‌గౌడ్
చీకటి వెలుగు నల్లగొండ,
బీసీ కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీసీ కులగణనపై నల్లగొండలోని బీసీ సంక్షేమ భవన్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రధర రామరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తయినా బీసీలకు చెప్పుకోదగిన న్యాయం చేయలేదని ఆరోపించారు. బీసీలను ఓబీసీలుగా గుర్తించి దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. దేశంలో బీసీలు ఉత్పత్తి కులాలుగా కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. దేశ జనాభాలో సుమారు 80 శాతం మంది వివిధ ఉత్పత్తి వృత్తులతో అనుబంధం ఉన్న కులాలకు చెందినవారేనని, దేశ సంపద సృష్టిలో వారి శ్రమకు ప్రధాన పాత్ర ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, చేతివృత్తులు, కులవృత్తులు, పారిశ్రామిక రంగాలతో పాటు అనేక ఉత్పత్తి రంగాల్లో బీసీల కృషి కీలకమన్నారు. బీసీ కులాల్లో 136 కులాలు ఉన్నాయని, వివిధ రాష్ట్రాల్లో ఆయా కులాలకు భిన్నమైన పేర్లు, గుర్తింపులు ఉన్నందున దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించడం అత్యవసరమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కులగణన ద్వారా బీసీల వాస్తవ జనాభాతో పాటు వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు స్పష్టమవుతాయని తెలిపారు. కులగణన లేకపోవడంతో బీసీలు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలు, పదోన్నతులు తదితర రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 29 రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. 29 రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణను నిర్మించి, బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అవసరమైతే దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టి పార్లమెంట్ ముట్టడికి కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. బీసీల హక్కుల సాధన కోసం బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలు కోసం దేశంలో బీసీ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో బీజేపీ కమండల్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బీసీల సమగ్ర కులగణన నిర్వహించి, జనాభా ప్రాతిపదికన వారికి హక్కులు, రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నేర్ల కంటి కాషయ్య,నేలపల్లి సత్యనారాయణ,శ్రీనివాస్ ముదిరాజ్,కంది సూర్యనారాయణ,నల్లసోమ మల్లయ్య, కాశయ్య,వాడపల్లి సాయిబాబా, కేశబోయిన శంకర్ గౌడ్,తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments