ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో యువజన వారోత్సవాలు

సీఎం కప్ విజేతలకు బహుమతులు.. జాబ్ మేళాలో ఎంపికైన యువతకు నియామక పత్రాల అందజేత
నల్లగొండ:
యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన యువజన వారోత్సవాల్లో శనివారం ఉదయాదిత్య భవన్‌లో సీఎం కప్ క్రీడలలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసి, జాబ్ మేళాలో ఎంపికైన యువతకు నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య యువత అధిక సంఖ్యలో ఉన్నారని, యువతే దేశానికి గొప్ప వనరని అన్నారు. యువత స్వయం సమృద్ధిగా ఎదగడానికి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో “ఫిట్ తెలంగాణ” కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. నల్గొండలో న్యాక్ సెంటర్, సెట్విన్ సెంటర్, ఇందిరా మహిళా శక్తి కేంద్రాల ద్వారా యువతకు కెరీర్ మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఎంఎస్‌ఎంఈ ద్వారా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. యువత సమాజ అవసరాలను అర్థం చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చాటింగ్‌లపై సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ఎక్కడైనా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అనంతరం సీఎం కప్ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించిన హాకీ జట్టును కలెక్టర్ అభినందించారు. కిక్ బాక్సింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్ తదితర క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోచ్ శంభులింగం, వివిధ కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments