చీకటి వెలుగు నల్గొండ:
నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయంలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
గొల్లగూడ డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూములు, టాయిలెట్లు, కిచెన్ గదులు తదితర పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని సూచించారు. అలాగే గృహ సముదాయం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గృహ సముదాయంలో జిమ్, పార్కులు, బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవా కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్‌కు సూచించారు. అదేవిధంగా లేఅవుట్ బోర్డులు, దిశా నిర్దేశిక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
గృహ సముదాయం పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు నివాసితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments