చీకటి వెలుగు నల్గొండ:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎంఎల్‌జీ రోడ్డులోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆవరణలో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “Inspired by Nature. For Climate. For Our Future.” కు అనుగుణంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, వాతావరణ మార్పుల నియంత్రణలో వృక్ష సంపద కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగకరమైన ఫలాలు అందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటునిస్తుందని మేయర్ చెప్పారు. నల్గొండలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు, పచ్చదనాన్ని విస్తరించేందుకు పెద్ద ఎత్తున వృక్షారోపణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండగా, అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. హరిత నల్గొండ నిర్మాణ లక్ష్యంతో నగర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు వృక్షారోపణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పచ్చదనం పెంపుదల ద్వారా కాలుష్య రహిత, ఆరోగ్యవంతమైన నల్గొండ నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నెం.21 కార్పొరేటర్ ఇబ్రహీం మొహమ్మద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. అశోక్, అసిస్టెంట్ ఇంజనీర్ అసీం బాబా, శానిటరీ సూపర్వైజర్ జి. శ్రీనివాస్, వార్డు అధికారి సి.హెచ్. శృతి, హరితహారం సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది, ఎన్‌ఏసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments