యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం, రూ.9.86 కోట్లతో కొండపై నిత్య కల్యాణ మండపం, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, రూ.1.34 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు, రూ.43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
ముందుగా కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల మధ్య వేద పాఠశాలకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం సీఎం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

15 ఎకరాల విస్తీర్ణంలో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు దశల్లో వేద పాఠశాలను నిర్మించనున్నారు. తొలి దశలో 500 మంది వేద విద్యార్థులకు విద్యాభ్యాసం చేసే విధంగా ఆధునిక సదుపాయాలతో నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థులకు వసతి గృహాలు, డైనింగ్ హాల్‌తో పాటు యజ్ఞశాల, యాగశాలలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుట్ట సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి కొండ సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments