చీకటి వెలుగు నల్లగొండ,
నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని నల్లగొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, సమావేశ మందిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ క్లబ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. క్లబ్ పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని, కలెక్టర్‌తో మాట్లాడి భూమి కేటాయింపునకు కృషి చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్ తరహాలో నల్లగొండ క్లబ్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఆరు నెలల్లో 24 గంటల తాగునీరు
నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వెంకట్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చుకుని పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి సొరంగ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గతంలో రూ.2 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పెరిగిందని, పనుల్లో ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని వివరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
రూ.900 కోట్లతో బాహ్య వలయ రహదారి
నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.900 కోట్లతో బాహ్య వలయ రహదారి నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గడంతో పాటు నగర రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, సుమారు రూ.1,400 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.300 కోట్లతో మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి వార్డులో సీసీ రోడ్లు, ద్వంద్వ రహదారులు నిర్మిస్తామని తెలిపారు. జాతీయ నిధుల నుంచి రూ.15 కోట్లు కేటాయించి పట్టణ రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,300 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారి పనులు చేపడుతున్నామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2,500 కోట్లతో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా నల్లగొండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.
విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ పాఠశాలను రూ.12 కోట్లతో అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాత పట్టణంలో రూ.10 కోట్లతో త్వరలో గ్రంథాలయం నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ, ప్రాథమిక స్థాయి విద్యా పునాదులను బలోపేతం చేసే సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్లగొండ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని ప్రాధాన్యంతో చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్‌రెడ్డి, ఆర్డీవో వై. అశోక్‌రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏదుల శ్రీధర్‌రెడ్డి, గుమ్మల జానకిరెడ్డి, క్లబ్ కార్యదర్శి చల్ల వెంకటరమణ, కాసర్ల వెంకటరెడ్డి, క్లబ్ సభ్యులు డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments