ePaper
Friday, September 4, 2026

అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో కొనసాగుతున్న ప్రవేశాలు

చీకటి వెలుగు నల్లగొండ,

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, ధ్రువపత్ర తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎడ్యుకేషన్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బి. ధర్మ నాయక్‌ సూచించారు. నల్లగొండ ప్రాంతీయ కేంద్రంలో ఆదివారం అధ్యయన కేంద్రాల సలహాదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మ నాయక్‌ మాట్లాడారు. వివిధ కారణాలతో సంప్రదాయ విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్‌ యూనివర్సిటీ విద్య ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దూరవిద్య విధానంలో విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో, సొంత వేగంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కోర్సులు: విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందిస్తున్నట్లు ధర్మ నాయక్‌ తెలిపారు. డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు డిప్లొమా, ధ్రువపత్ర, నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నూతన కోర్సుల ద్వారా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యను మరింత సులభతరం చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

ఉద్యోగాల కల్పనకు సంస్థలతో ఒప్పందాలు: టెలికాన్ఫరెన్స్‌ ద్వారా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఎల్‌.వి.కె. రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే టీసీఎస్‌, ఐకాన్‌, రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌, రాశి, వి-హబ్‌ తదితర సంస్థలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రతి విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో అత్యధిక ప్రవేశాలు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను ప్రవేశాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్‌ అనిల్‌ బొజ్జ, మహిళా డిగ్రీ కళాశాల సమన్వయకర్త రాజారామ్‌, అధ్యయన కేంద్రాల సలహాదారులు శ్రీకాంత్‌, మహేష్‌ పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!