కాలిపోయిన బోరు మోటర్లు, ఎండిన వరితో బీఆర్‌ఎస్ నిరసన.. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్:

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
చీకటి వెలుగు నల్లగొండ,
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నల్లగొండ విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించాయి. రైతులతో కలిసి కాలిపోయిన బోరు మోటర్లు, ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. లో-వోల్టేజ్, విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, లో-వోల్టేజ్ కారణంగా బోరు మోటర్లు కాలిపోతుండగా, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మోటర్లు కాలిపోవడం, పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. లో-వోల్టేజ్‌తో దెబ్బతిన్న మోటర్లకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. “సమస్య విద్యుత్‌లో మాత్రమే లేదు.. పాలనలోనే శక్తి లేదు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments