చీకటి వెలుగు నల్లగొండ:
దేశానికి సాంకేతిక విప్లవాన్ని పరిచయం చేసి, పేదలు, యువత సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లౌకికవాద సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముందుచూపుతో రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేశారని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ త్యాగాల కుటుంబానికి చెందిన మహానేతగా నిలిచిపోయారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఆ దిశగా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పీటీసీలు గుమ్ముల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస గౌడ్, స్థానిక కార్పొరేటర్ ఏదుళ్ల శ్రీధర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments