ePaper
Friday, September 4, 2026

ప్రిన్సిపాల్‌ను హతమార్చిన పదో తరగతి విద్యార్థులు!

‘బాబు’ అనే ఒక్క మాటతో బయటపడిన హత్య మిస్టరీ.. రూ.2.50 లక్షల కోసం దారుణం

చీకటి వెలుగు, నల్లగొండ:
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

‘బాబు’ అనే ఒక్క మాటతో దర్యాప్తులో కీలక మలుపు

హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె చివరిగా “బాబు” అని చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో విద్యార్థులను రూపారెడ్డి సాధారణంగా “బాబు” అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు.

వారం రోజుల ముందే రెక్కీ

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు విద్యార్థులు ఒకే హాస్టల్ గదిలో ఉండేవారు. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలపై వారు ఆసక్తి చూపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రిన్సిపాల్ వద్ద భారీగా నగదు ఉంటుందని భావించి, గతంలో డబ్బుల విషయంలో ఆమె మందలించడంతో కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు ముందు సుమారు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి.. ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి, ఎప్పుడు ఎవరూ ఉండరు, ఎలా బయటపడాలి అనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు.

కత్తి, గ్లౌజులు, మాస్కులతో ఇంట్లోకి ప్రవేశం

హత్య జరిగిన రోజు సాయంత్రం స్కూల్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఎరుపు రంగు హుడీ, ప్యాంట్ తీసుకుని కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.

ఒకరు బయట కాపలా ఉండగా, మరొకరు ఇంటి వెనుక వైపు నుంచి ప్రవేశించి వంటగది ద్వారా లోపలికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు వెల్లడించారు.

రూ.2.50 లక్షల నగదు కోసం హత్య?

బెడ్‌రూమ్‌లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్‌ఫోన్ తదితరాలను చెట్ల పొదల్లో పడేసి.. కొంతదూరం వెళ్లిన తర్వాత దుస్తులు మార్చుకున్నట్లు పేర్కొన్నారు. ఎరుపు హుడీని డ్రైనేజీలో పడేసినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలతో నిందితుల గుర్తింపు

క్రైమ్ సీన్ నుంచి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.

పాఠశాల పునఃప్రారంభమైన అనంతరం విద్యార్థులను ఒక్కొక్కరినీ విచారించడంతో పాటు, రెండు రోజులుగా స్కూల్‌కు రాని విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. చివరకు ఇద్దరు పదో తరగతి మైనర్ విద్యార్థులపై అనుమానం బలపడినట్లు పోలీసులు తెలిపారు.

దొనియాల ‘ఎక్స్’ రోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.

రూ.1.54 లక్షల నగదు స్వాధీనం

విద్యార్థుల వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అదే సమయంలో మృతురాలి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక హెచ్చరిక

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేసి కేసును ఛేదించినట్లు వెల్లడించారు.

“ఎంత తెలివిగా నేరం చేసినా సైంటిఫిక్ ఆధారాల నుంచి తప్పించుకోలేరు” అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.

మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని క్రమశిక్షణతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.

పోలీసు బృందాలకు ఎస్పీ అభినందనలు

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ M.V. శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ A. నవీన్ కుమార్, CCS ఇన్‌స్పెక్టర్ M. జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్‌ఐ A. రమేష్, చింతపల్లి ఎస్‌ఐ M. రామ్మూర్తి, గుడిపల్లి ఎస్‌ఐ D. నరసింహులు, గుర్రంపొడు ఎస్‌ఐ N. వెంకన్న, CCS ఎస్‌ఐ U. సురేష్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.

— చీకటి వెలుగు, నల్లగొండ


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!