ePaper
Friday, September 4, 2026

వట్టే జానయ్య యాదవ్ కుటుంబం పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.

చీకటి వెలుగు నల్లగొండ.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్యపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
యాదవ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదుగుతున్న జానయ్యను అడ్డుకునేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట కేంద్రంగా ఎదుగుతున్న ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని విమర్శించారు.
జానయ్య భార్యకు బెయిల్ మంజూరై బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడికి వెళ్లి మరోసారి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులకు చట్టంపై గౌరవం ఉందా అని నిలదీశారు. బెంగళూరులో వైద్య విద్య అభ్యసిస్తున్న జానయ్య చిన్న కుమారుడిని అక్కడికి వెళ్లి అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచకుండా అతడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
పది రోజులుగా జానయ్యతోపాటు ఆయన పెద్ద కుమారుడి ఆచూకీ కూడా తెలియడం లేదని తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఎక్కడైనా నిర్బంధించారా, లేక వారు తమంతట తామే ఎక్కడైనా ఉన్నారా అనేది స్పష్టం చేయాలని కోరారు. అరెస్టు చేసి ఉంటే వెంటనే న్యాయస్థానం ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
బియ్యం మిల్లర్ల వ్యవహారంలో రూ.13 వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై అందరినీ విచారించాల్సి ఉండగా, పెద్దలను వదిలి చిన్న మిల్లర్లను మాత్రమే వేధించడం సరికాదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు జానారెడ్డి ఈ వ్యవహారంలో చొరవ తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా శనివారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని మేకల రాములు యాదవ్ ప్రకటించారు. సమావేశంలో సమితి నాయకులు జంగయ్య యాదవ్, గుడిగె శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, జక్కుల రాములు యాదవ్, మధు యాదవ్, కిరణ్ యాదవ్, శివ యాదవ్, మహేశ్ యాదవ్, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!