క్షేత్రస్థాయిలో పరిశీలించిన శరత్ చంద్ర పవార్.. లోపాల సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు
చీకటి వెలుగు నల్లగొండ,
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర కూడళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని రాష్ట్ర రహదారి 02, జాతీయ రహదారి 167 పరిధిలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వెల్‌కమ్ టూ మిర్యాలగూడ జంక్షన్, నందిపాడు ఎక్స్ రోడ్డు, చిల్లాపురం క్రాస్ రోడ్డు, చింతపల్లి క్రాస్ రోడ్డు, జంకుతాడా రోడ్డు, మిర్యాలగూడ అప్రోచ్ రోడ్డు ప్రాంతాలను ఎస్పీ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకరంగా ఓవర్‌టేకింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రహదారి గుర్తులు చెరిగిపోవడం, అక్రమ పార్కింగ్, రాత్రివేళల్లో తగిన వెలుతురు లేకపోవడం, రహదారులపై అనధికారిక మార్గాలు ఉండటం వంటి అంశాలను ఎస్పీ గుర్తించారు. ప్రమాదాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో వేగ నియంత్రకాలు ఏర్పాటు చేయడం, పాదచారుల కోసం జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయడం, మధ్య రేఖలు, రహదారి గుర్తులకు తిరిగి రంగులు వేయడం, శబ్ద హెచ్చరిక పట్టీలు ఏర్పాటు చేయడం, నిఘా కెమెరాలు అమర్చడం, అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రతిబింబించే హెచ్చరిక బోర్డులు, దిశా సూచికలు, క్యాట్ ఐస్ ఏర్పాటు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అన్ని కూడళ్ల వద్ద అక్రమ పార్కింగ్‌ను పూర్తిగా తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారులు, పంచాయతీరాజ్, ట్రాఫిక్, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదకర ప్రాంతాల్లోని లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అనవసరమైన కూడళ్లు, అనధికారిక మార్గాలను సాధ్యమైనంత వరకు మూసివేయాలని, అవసరమైన చోట మాత్రమే నియంత్రిత యూ-టర్న్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదకర కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, నిర్లక్ష్యపు ఓవర్‌టేకింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో మిర్యాలగూడ ఇన్‌చార్జి డీఎస్పీ రవి, సీఐలు పి.ఎన్.డి ప్రసాద్, సోమనర్సయ్య, నాగభూషణ్, నాగరాజు, ఎస్‌ఐ లక్ష్మయ్య, డీటీఆర్‌బీ ఇన్‌చార్జి రిటైర్డ్ సీఐ అంజయ్య, రోడ్డు భద్రత అధికారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, రవాణా శాఖ అధికారులు, స్థానిక ప్రజలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments