ePaper
Monday, September 7, 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ డిమాండ్

నకిరేకల్, జూలై 22: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి రాజకీయ బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం నకిరేకల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, జాతీయ పరీక్షల సంస్థను రద్దు చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు న్యాయం చేయడం వంటి డిమాండ్లతో ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ బాధ్యత వహించి స్పందించాలని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జంతర్ మంతర్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు, సామాజిక కార్యకర్తలు అనేక రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ వారితో చర్చలు జరపకుండా ర్యాలీని బలప్రయోగంతో అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కల్పించిందని, ఆ హక్కును హరించే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ కార్యదర్శి ముస్కు రవీందర్, డివిజన్ అధ్యక్షుడు అరూరి ప్రణీత్, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అదిమల్ల సుజిత్, వీరేష్, రోహిత్, సురేష్, గోపి, విష్ణు, శ్రీశాంత్, వేణు, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!