ePaper
Friday, July 24, 2026

డా. కిషస్ నున్వత్స ఆధ్వర్యంలో అకాలేషియా బాధితురాలికి కోతలేని చికిత్స

నల్గొండ మహిళకు మలక్‌పేట యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విజయవంతమైన ‘పోయం’ ప్రక్రియ

చీకటి వెలుగు నల్లగొండ,

ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం వంటి సమస్యలతో బాధపడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన 52 ఏళ్ల మహిళకు మలక్‌పేట యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డా. కిషస్ నున్వత్స (ఎంబీబీఎస్, ఎండీ–సాధారణ వైద్యం, డీఎం–జీర్ణాశయ వ్యాధులు) ఆధ్వర్యంలో పెర్–ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పోయం) విధానంలో విజయవంతంగా చికిత్స అందించారు.
కొంతకాలంగా ఆహారం మింగలేకపోవడం, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, క్రమంగా బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో టైప్–2 అకాలేషియా కార్డియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వైద్య బృందం ఎలాంటి బాహ్య కోతలు లేకుండా నోటి ద్వారానే పోయం ప్రక్రియను నిర్వహించింది. చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డా. కిషస్ నున్వత్స మాట్లాడుతూ, అకాలేషియా కార్డియా అనేది అన్నవాహిక దిగువ భాగంలోని కండరాలు సరిగా సడలకపోవడం వల్ల ఆహారం, ద్రవాలు కడుపులోకి సులభంగా చేరలేని అరుదైన వ్యాధి అని వివరించారు. దీనివల్ల ఆహారం మింగడంలో ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి రావడం, ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
పోయం విధానంలో ఎలాంటి బాహ్య శస్త్రచికిత్స అవసరం ఉండదని చెప్పారు. ప్రత్యేక అంతర్దర్శన పరికరాల సహాయంతో ఆహార ప్రవాహానికి అడ్డుగా ఉన్న కండరాలను లోపలి నుంచి విడదీసి, ఆహారం సాధారణంగా కడుపులోకి వెళ్లేలా చేస్తామని వివరించారు. ఈ చికిత్సలో నొప్పి తక్కువగా ఉండటంతో పాటు రోగులు త్వరగా కోలుకుంటారని, శరీరంపై మచ్చలు ఉండవని, ఆస్పత్రిలో తక్కువ రోజులు మాత్రమే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఆహారం లేదా ద్రవాలు మింగడంలో ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, కారణం లేకుండా బరువు తగ్గడం, తరచూ ఆహారం గొంతులో ఇరుక్కుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జీర్ణాశయ వ్యాధుల నిపుణులను సంప్రదించాలని డా. కిషస్ నున్వత్స సూచించారు.
అకాలేషియా కార్డియా చికిత్సలో పోయం విధానం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన పద్ధతిగా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే దీర్ఘకాలిక ఉపశమనం పొందే అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!