మిల్లర్లకు ముప్పేట కష్టాలు
సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయింపు..
ఉడికించిన బియ్యం స్వీకరణ నిలిపివేతతో మిల్లులు మూత
చీకటి వెలుగు నల్లగొండ,
రాష్ట్రంలోని బియ్యం మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మిల్లర్లు డిమాండ్ చేశారు. బకాయిలున్న, డిఫాల్టర్ మిల్లులపై తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాలను వసూలు చేసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే బకాయిలు లేని మిల్లర్లను కూడా తనిఖీల పేరుతో వేధించడం, అందరినీ అనుమానితులుగా చూడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించవద్దని కోరారు.
9.70 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు: 2014 నుంచి 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సుమారు 9.70 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మిల్లర్లు తెలిపారు. ఇందులో దాదాపు 9 కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అందించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అందాల్సిన బియ్యంలో లోటు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, దాదాపు 90 శాతం మంది మిల్లర్లను అనుమానిస్తూ తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డిఫాల్టర్ మిల్లర్ల నుంచి బకాయిలను ప్రభుత్వం ఏ విధానంలోనైనా వసూలు చేసుకోవచ్చని, అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయింపు: 2025–26 రబీ సీజన్‌లో మిల్లుల మిల్లింగ్ సామర్థ్యానికి మించి దాదాపు 200 శాతం వరకు, సుమారు 7 లక్షల టన్నుల ధాన్యాన్ని కేటాయించారని మిల్లర్లు తెలిపారు. ధాన్యం దిగుమతి ప్రారంభంలోనే కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఉడికించిన బియ్యం రూపంలో అందిస్తామని జిల్లా యంత్రాంగానికి, కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశామని చెప్పారు. అయినప్పటికీ ఆగస్టు 28 నుంచి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని కేవలం ముడి బియ్యం రూపంలోనే తీసుకుంటామని, ఉడికించిన బియ్యం స్వీకరించబోమని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఐదు రోజులుగా మిల్లులు మూత: కనీసం వారం రోజుల ముందుగా సమాచారం ఇవ్వకుండా ఉడికించిన బియ్యం స్వీకరణను నిలిపివేయడంతో ఇప్పటికే మిల్లింగ్ చేసిన బియ్యం మిల్లుల్లోనే నిల్వ ఉండిపోయిందని తెలిపారు. నిల్వలు పేరుకుపోవడంతో బియ్యం పాడయ్యే పరిస్థితి ఏర్పడిందని, దీనికితోడు గత ఐదు రోజులుగా అనేక మిల్లులు మూతపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒక నెలపాటు మిల్లు మూతపడితే నిర్వహణ ఖర్చుల రూపంలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
25 శాతం జరిమానా.. 12 శాతం వడ్డీ: మిల్లుల వద్ద ధాన్యం ఉండి, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని సకాలంలో అందించలేదనే కారణంతో 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీ విధించే పరిస్థితి ఉందని మిల్లర్లు తెలిపారు. ముడి బియ్యం అందించే పరిస్థితి తమకు లేదని, అందువల్ల మిల్లుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వానికే తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ధాన్యాన్ని స్వీకరించి తమ ఖాతాలో జమ చేసుకోవాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి లిఖితపూర్వకంగా వినతులు సమర్పించినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు.
ప్రస్తుతం మిల్లుల వద్ద ఉన్న ధాన్యం పూర్తయ్యే వరకు కొత్తగా ధాన్యం కేటాయించాల్సిన అవసరం లేదని మిల్లర్లు స్పష్టం చేశారు. 2026–27 వానాకాలం సీజన్‌లో కొనుగోలు చేసే ధాన్యాన్ని ప్రభుత్వ గిడ్డంగుల్లోనే భద్రపరచాలని సూచించారు. అనంతరం నాలుగు లారీల బియ్యాన్ని ముందుగా సమర్పించిన తర్వాత ధాన్యం కేటాయించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. ముందుగా పరీక్షా మిల్లింగ్ నిర్వహించి బియ్యం నాణ్యతను నిర్ధారించాలని సూచించారు.
దిగుబడి ప్రమాణాలతో నష్టం: ప్రస్తుతం రెండు రకాల ముడి బియ్యానికి 67 శాతం, రెండు రకాల ఉడికించిన బియ్యానికి 68 శాతం దిగుబడి ప్రమాణాలు విధించడం వల్ల సార్టెక్స్ ప్రక్రియలో మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఖాళీ గోనె సంచుల్లో ఖాప్రా పురుగు ఉండటంతో వాటిలో నిల్వ చేసిన బియ్యం తిరస్కరణకు గురవుతోందని చెప్పారు.
40 ఏళ్లుగా మారని రుసుములు: గత 40 ఏళ్లుగా పని నిర్వహణ రుసుములు రూ.10, రూ.20గానే కొనసాగుతున్నాయని మిల్లర్లు తెలిపారు. పెరిగిన విద్యుత్, కార్మిక, నిర్వహణ, రవాణా ఖర్చులకు అనుగుణంగా రుసుములను సవరించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో పదేళ్ల వరకు రుసుములు చెల్లించకపోవడంతో మిల్లర్లపై ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు. రవాణా, దిగుమతి–దిగుబడి, సంరక్షణ, నిర్వహణ తదితర రుసుములు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు.
2022–23 రబీ సీజన్‌లో టెండర్ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించిన సంరక్షణ, హమాలీ, నిర్వహణ రుసుములు ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. అదే సమయంలో టెండర్ ధాన్యానికి మార్కెట్ రుసుములు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒకసారి చెల్లించిన మార్కెట్ రుసుములను మళ్లీ చెల్లించాలని ఒత్తిడి చేయడంతో పాటు మార్కెట్ అనుమతులను పునరుద్ధరించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
ఖాళీ గోనె సంచులతోనూ సమస్యలు: ప్రభుత్వానికి చెందిన ఖాళీ గోనె సంచులను తిరిగి తీసుకెళ్లకపోవడంతో గత పదేళ్లుగా అవే సంచులను ప్రతి ధాన్యం కొనుగోలు సమయంలో తిరిగి వినియోగించాల్సి వస్తోందని మిల్లర్లు తెలిపారు. ఫలితంగా 25 శాతం వరకు సంచుల నష్టం వాటిల్లుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఖాళీ సంచుల లెక్కలను పూర్తిస్థాయిలో నమోదు చేయలేదన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మిల్లింగ్ రుసుములు తక్కువగా ఉన్నాయని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. బకాయిలున్న మిల్లులపై చర్యలు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే బకాయిలేని మిల్లర్లను తనిఖీల పేరుతో వేధించడం, అందరినీ ఒకే గాటన కట్టడం మానుకోవాలని కోరారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మిల్లర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు ధాన్యం–బియ్యం సేకరణ విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు, కార్యవర్గ సభ్యుడు జూలకంటి ఇంద్రారెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, సంయుక్త కార్యదర్శి కండె రామకృష్ణ, చిట్యాల కేంద్ర అధ్యక్షుడు తేరేటిపల్లి హనుమంత్, ప్రధాన కార్యదర్శి పోల పెద్దయ్య, నకిరేకల్ అధ్యక్షుడు కన్మంత రెడ్డి కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తొనుపునూరి వెంకటేశ్వర్లు, దేవరకొండ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శిల శ్రీనివాస్, నల్లగొండ అధ్యక్షుడు వీరుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తేలుకుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments