నల్గొండలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ
డీఎస్పీ శివరాం రెడ్డి
చీకటి వెలుగు నల్గొండ,
పండుగ వేళ సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక క్లాక్‌టవర్ సెంటర్‌లో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం రెడ్డి, మిలాద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ మసీయుద్దీన్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పండుగ వేళ మానవతా దృక్పథంతో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తం అత్యవసరమైన సమయంలో ఒక్కరి దానం మరొకరి జీవితాన్ని నిలబెట్టగలదని పేర్కొన్నారు. యువత సేవా భావంతో ముందుకొచ్చి రక్తదానంలో భాగస్వాములు కావాలని కోరారు. మిలాద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ మసీయుద్దీన్ మాట్లాడుతూ శాంతి, కరుణకు ప్రతీక అయిన మిలాద్-ఉన్-నబి సందర్భంగా ప్రతి ఏటా మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీపీఎం నాయకుడు సయ్యద్ హాశం, మిలాద్ కమిటీ కార్యదర్శి సయ్యద్ హబీబుద్దీన్, సీపీఎం నాయకుడు ఎం.డి. సలీమ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘాల అధ్యక్షుడు కె. శివకుమార్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు జమాల్ ఖాద్రీ, గౌస్ మోహియుద్దీన్ హాశం, ముహీతుల్లా తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments