రోస్టర్ విధానం సవరించాలంటూ మహాధర్నా.. వర్గీకరణపై జాతీయ మాలమహానాడు నిరసన.
చీకటి వెలుగు నల్లగొండ.
ఎస్సీ వర్గీకరణ, ఏకపక్ష రోస్టర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31న హైదరాబాద్‌లోని సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చినట్లు జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. మాలల విద్యా, ఉద్యోగ అవకాశాలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వద్ద జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలి సైదులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనంతరం గ్రూప్-3 పరిధిలోని మాల, అనుబంధ 25 కులాలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎస్సీ రోస్టర్ విధానం కారణంగా మాల విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు దూరమవుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు వెలువడిన 14 ఉద్యోగ నోటిఫికేషన్లలో గ్రూప్-3లోని మాల, అనుబంధ కులాలకు ఒక్క పోస్టు కూడా దక్కలేదని పేర్కొన్నారు. మాలల భవిష్యత్తును దెబ్బతీసే విధానాలను ప్రభుత్వం వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని సవరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కోసం ఆగస్టు 31న సచివాలయ ముట్టడి చేపడుతున్నామని, మాలలు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాల జేఏసీ కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ.. మాలల విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్‌లో 20లోపు మూడు పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం మాలలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఆంధ్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ.. వర్గీకరణ పేరుతో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్న విధానాలను ఎండగట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బోగరి విజయ్, నల్లవెల్లి సంజీవ, మాల జేఏసీ కన్వీనర్ నల్లల కనకరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేడి అంజయ్య, వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, సర్వే సార్, కళాకారుడు గోరేటి రమేష్, మాల యువత నాయకులు కట్ట వినయ్, చింతమల్ల విజయ్‌కుమార్, ఆంధ్ర మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రవి, ఏపీ రెల్లి సంఘం నాయకులు రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, మణెమ్మ, రావుల శ్రీనివాస్, గాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments