ePaper
Friday, September 4, 2026

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి: బీసీ విద్యార్థి సంఘం.

చీకటి వెలుగు నల్లగొండ.

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ర్యాలీ, రాస్తారోకో, కళాశాల బహిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలలుగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు ₹10,000 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో అనేక కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాలు, విదేశీ విద్య అవకాశాలు వచ్చినప్పటికీ సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే జీఓ నంబర్ 8, 9 వల్ల ఫీజు చెల్లింపుల విషయంలో గందరగోళం నెలకొన్నదని, కాలేజీలు విద్యార్థులపై ముందుగానే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లు ఇవని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చట్టబద్ధమైన రక్షణ కల్పించి ప్రతి ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. జీఓ నంబర్ 8, 9లను రద్దు చేయాలని, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమయంలో ఫీజులు వసూలు చేయకూడదని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, ఫీజు బకాయిల కారణంగా నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లను వెంటనే విడుదల చేయించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, హైదరాబాద్ సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని జనార్దన్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజు యాదవ్, నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, పొగాకు రవికుమార్ యాదవ్, మల్లబోయిన తరుణ్ కుమార్, అనంత నాగరాజు గౌడ్, అంబటి శివకుమార్, గడగోజు విజయాచారి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!