ePaper
Friday, September 4, 2026

చేనేత వైభవాన్ని చాటేలా జాతీయ చేనేత దినోత్సవం.

చీకటి వెలుగు నల్లగొండ.

స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఐటీ టవర్ నుంచి రాఘవేంద్ర కాలనీ వరకు సాగిన ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వదేశీ ఉద్యమ సమయంలో చేనేత వస్త్రాల ప్రాధాన్యతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.
చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు, పింఛన్లు వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. చేనేత రంగానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు ఆదర్శనీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు చేనేత వస్త్రాలను వినియోగించి ఈ రంగానికి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత సంఘాల నాయకులు కర్నాటి వెంకటేశం, గంజి మురళి, రాపోలు దత్త గణేష్, సంఘాల ప్రతినిధులు పద్మశాలి సంఘం అధ్యక్షుడు పి. సత్యనారాయణ, కర్నాటి యాదగిరి, పవర్‌లూమ్స్ జిల్లా యజమానుల సంఘం అధ్యక్షుడు చేరుపల్లి శ్రీనివాస్, చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!