ePaper
Friday, September 4, 2026

ఆగస్టు 9న సామాజిక న్యాయ పోరాట సభ.. విజయవంతం చేయాలని బీసీఐఎఫ్ పిలుపు.

చీకటి వెలుగు నల్గొండ.

బీసీల హక్కులు, రాజ్యాంగబద్ధమైన డిమాండ్ల సాధన లక్ష్యంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (బీసీఐఎఫ్) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9న జిల్లా కేంద్రంలోని జి.ఎల్. గార్డెన్స్‌లో నిర్వహించనున్న ‘సామాజిక న్యాయ పోరాట సభ’ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన సమన్వయకర్త నేలపట్ల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సభకు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ కలెక్టర్ టి. చిరంజీవులు (విశ్రాంత ఐఏఎస్) ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. సభ విజయవంతానికి ఆదివారం జిల్లా కేంద్రంలోని గడియార స్తంభం కూడలిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద వివిధ బీసీ, ఎస్సీ సంఘాల నాయకులతో కలిసి సభ గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం టి. చిరంజీవులు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా నిరంతరం ఉద్యమం సాగిస్తూ, బీసీలలో చైతన్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదంతో వెంటనే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే లోక్‌సభ, శాసనసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణలో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని కోరారు. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో నిధులు కేటాయించాలని, బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చి సమర్థంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం, ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయడం, జాతీయ కుల గణనలో ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించడం, హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు ఉన్నత న్యాయ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలను పరిష్కరించడం వంటి డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీఐఎఫ్ జిల్లా సమన్వయకర్తలు గుండెబోయిన జానయ్య యాదవ్, చామల చంద్రశేఖర్, రాష్ట్ర యువజన విభాగం ఇన్‌చార్జి మావిండ్ల లింగేష్ యాదవ్‌తో పాటు గుండెబోయిన లింగయ్య యాదవ్, మిర్యాల యాదగిరి, నల్లా సోమమల్లయ్య, దుడుకు లక్ష్మీనారాయణ, కొంపెల్లి భిక్షపతి, కొన్నె శంకర్ గౌడ్, బోనగిరి దేవేందర్, అయితగోని జనార్దన్ గౌడ్, పందుల సైదులు, కొప్పు రాంబాబు, ఆనందపు ఆదినారాయణ, నిమ్మనగోటి జనార్ధన్, శిరసవాడ చంద్రం, తరాల పరమేశ్ యాదవ్, జనగాం వెంకన్న గౌడ్, వైద్యుల యాదగిరి, నిమ్మనగోటి వెంకటరమణ, లక్ష్మయ్య, వనం లక్ష్మీపతి, అద్దంకి సునీల్ కుమార్, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, చిట్టబోయిన లింగయ్య, చింతకాయల పుల్లయ్య, శివ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!