ePaper
Thursday, July 23, 2026

గ్రామాభివృద్ధికి అవసరమైన పనులకే ప్రాధాన్యం ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

చీకటి వెలుగునల్గొండ

గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా గ్రామానికి నిజంగా అవసరమైన పనులను మాత్రమే గుర్తించి చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. గ్రామపంచాయతీల్లో శాశ్వత ఆస్తులు సృష్టించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

ఉదయాదిత్యభవన్‌లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న “గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక” అవగాహన, శిక్షణ కార్యక్రమంలో గురువారం కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎనిమిది మండలాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమలవుతున్న “వికసిత్ భారత్ జీ రామ్ జీ” పథకం ద్వారా గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, రూరల్ హెల్త్ సెంటర్లు, వెటర్నరీ భవనాలు, గ్రామీణ గ్రంథాలయాలు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, సోలార్ లైట్లు, రీసైక్లింగ్ ప్లాంట్లు, గ్రామీణ బస్టాండ్లు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు.

గ్రామస్థులతో చర్చించి అవసరమైన పనులను ఎంపిక చేసి, వాటిని ఐదు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి లేని వారికి ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించాలని అన్నారు.

చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, గత ఏడాది ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ.35 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గ్రామపంచాయతీలకు శాశ్వత ఆస్తులు సమకూరేలా పనులు చేపట్టాలని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

గ్రామ సమృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే పనులు, నీటి సంరక్షణ, పారిశుధ్యం, స్వచ్ఛభారత్ టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను కూడా ఈ పథకం ద్వారా అమలు చేయవచ్చని వివరించారు. అనంతరం సర్పంచులు అడిగిన పలు సందేహాలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్ రెడ్డి వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం, గ్రామ సమృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాల పాత్ర, స్వచ్ఛభారత్ తదితర అంశాలపై వివరించారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ శంకర్ నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

ఉదయం జరిగిన సమావేశానికి చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పి.ఏ.పల్లి, గుడిపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకాగా, మధ్యాహ్నం శాలిగౌరారం, అనుముల, గుర్రంపోడు, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం మండలాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!