డీఈవో కార్యాలయంలో ఏడి గారికి వినతిపత్రం అందజేత
నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) గారికి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, జిల్లాలో గుర్తింపు లేకుండా కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు నిర్వహణ కొనసాగిస్తూ తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొన్ని విద్యాసంస్థలు ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే అనుమతి తీసుకొని హైస్కూల్ వరకు తరగతులు నిర్వహిస్తున్నాయని, ఒకే బ్రాంచ్‌కు అనుమతి తీసుకుని అనేక శాఖలను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే జిల్లాలోని ప్రతి పాఠశాల గుర్తింపు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న గుర్తింపు లేని విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నల్గొండ మండల కార్యదర్శి కండె యాదగిరి, నాయకులు బూర్గు గోపికృష్ణ, గద్దపాటి రఘువరన్, మాదాసు శ్రవణ్, గుణాలపూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments