ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ప్రజల సహకారం అవసరం: కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, జూన్ 25: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వచ్చే బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ కోరారు.
గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రహమత్‌నగర్‌లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న బీఎల్ఓల పనితీరును పరిశీలించి, కుటుంబ సభ్యులు, ఓటర్ల సంఖ్య, యాప్ అప్‌డేట్ వంటి అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, వాటిని పూర్తి వివరాలతో నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి అందించాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటికే 86 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. గత మ్యాపింగ్ సమయంలో అందుబాటులో లేని వారిని కూడా ఈ ప్రక్రియలో నమోదు చేస్తామని, ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
2002 ఓటరు జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం కూడా పేరు ఉన్నవారు అదనపు ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, అయితే కొత్తగా నమోదు చేసుకునేవారు లేదా ప్రస్తుతం జాబితాలో పేరు లేని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలని వివరించారు.
కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్ అమీనా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments