27న కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగుల భారీ తరలింపు
చీకటి వెలుగు నల్లగొండ,
పెన్షన్ బకాయిలు, వేతన సవరణ సంఘం, ఆరు విడతల కరవు భత్యం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ 2024 నల్లగొండ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. నల్లగొండలోని పీఆర్టీయూ భవనంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా అధ్యక్షుడు కాటబత్తుల గణేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి బిక్షపతి, రాష్ట్ర నాయకులు తీగల శంకరయ్య, దివాకర్తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. 2024 మార్చి తర్వాత వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఈ సమావేశానికి హాజరై, తమకు రావాల్సిన పెన్షన్ బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా ఏకమొత్తంగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంఘాలు సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 27న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట నిర్వహించే ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం, సీపీఎస్ రద్దు, ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, వేతన సవరణ సంఘం అమలు, పెండింగ్లో ఉన్న ఆరు విడతల కరవు భత్యం చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంఘాలు సంయుక్త కార్యాచరణ సమితిగా ఏర్పడి ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణపై నోటీసు అందజేశారు. ఆగస్టు 27న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, సెప్టెంబరు 1న పెన్షన్ వ్యతిరేక దినం, సెప్టెంబరు 10న హైదరాబాద్లో శాసనసభ ముట్టడి, మహాధర్నా నిర్వహించనున్నట్లు సంయుక్త కార్యాచరణ సమితి ప్రకటించింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి పెన్షన్ బకాయిలు, వేతన సవరణ సంఘం, ఆరు విడతల కరవు భత్యం, సీపీఎస్ రద్దు తదితర సమస్యలను సాధించుకోవడానికి సమష్టిగా కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి రామకృష్ణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మేడి లింగయ్య, సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి ముజాహిద్ అలీ ఖాన్, సహాధ్యక్షుడు సదానందం, సుదర్శన్, కిషన్ రావు, మేడిగా రఘు, తిరందాసు సత్తయ్య, బాలయ్య, హమీద్ ఖాన్, సురయ్య బిల్గిస్, సుధారాణి, రామకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments