గవర్నర్ కోటాలోనా.. పట్టభద్రుల స్థానం నుంచా?
బీసీలకు చేరువయ్యేలా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు
యువ నాయకత్వానికి అవకాశాలపై సంకేతాలు
నల్లగొండ (తెలుగుప్రభ): కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్న నేపథ్యంలో బీసీ సామాజికవర్గం నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ గవర్నర్ కోటాలో అవకాశం దక్కకపోతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దింపే అవకాశాలపైనా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
బీసీ కోటాలో ప్రాధాన్యం
పద్మశాలి సామాజికవర్గానికి చెందిన కీలక నేతగా గుర్తింపు పొందిన కైలాష్ నేతకు బీసీ వర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బీసీ వర్గాలను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆ వర్గాలకు మరింత చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్షుడిగా చురుకైన పాత్ర
రాజకీయ చైతన్యానికి పేరున్న నల్లగొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేత పార్టీని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కలుపుకుపోతూ కాంగ్రెస్ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం
విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైలాష్ నేత అనంతరం కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ, సంస్థాగత అనుభవాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం 2025లో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
అధిష్ఠానం వద్ద విధేయత
డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అధిష్ఠానం ఆదేశాలను అమలు చేయడంలోనూ, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలోనూ ఆయన చూపుతున్న చొరవ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
బీసీ రాజకీయాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో బీసీ సామాజికవర్గం రాజకీయంగా కీలకంగా మారుతున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఆ వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బీసీ అజెండాతో ముందుకు వస్తున్న ఇతర పార్టీలకు రాజకీయంగా చెక్ పెట్టడంతో పాటు, బీసీ వర్గాల్లో పార్టీకి మరింత బలమైన పునాది ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కైలాష్ నేతకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశం తెరపైకి వచ్చిందనే ప్రచారం సాగుతోంది.
గవర్నర్ కోటా.. లేక పట్టభద్రుల స్థానం?
ప్రస్తుతం అందరి దృష్టి గవర్నర్ కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలపైనే ఉంది. ఈ కోటాలో బీసీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో కైలాష్ నేత పేరును పరిశీలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు భవిష్యత్‌లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయనను పోటీ చేయించే అవకాశాన్ని కూడా పార్టీ పరిశీలించవచ్చన్న ప్రచారం ఉంది.
అయితే ఎమ్మెల్సీ పదవిపై ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కైలాష్ నేతకు నిజంగానే అవకాశం దక్కుతుందా? గవర్నర్ కోటాలోనా.. లేక పట్టభద్రుల నియోజకవర్గం నుంచా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కైలాష్ నేత పేరు ప్రస్తుతం ఎమ్మెల్సీ రేసులో ప్రముఖంగా వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments