ePaper
Friday, September 4, 2026

సీఎం నాగార్జునసాగర్ పర్యటనలో డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్టులు ఖండనీయం

నల్గొండ, ఆగస్టు 10: ముఖ్యమంత్రి నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గాదేపాక సాయి తేజను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని వారు కోరారు. విద్యార్థులు, యువత సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!