ePaper
Friday, September 4, 2026

నాగార్జునసాగర్‌లో నీరు నామమాత్రమే.. వరి వద్దు

ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేస్తాం

చీకటి వెలుగు నల్లగొండ,

ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరాయని, ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మళ్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం మృత నిల్వ స్థాయిలో నీరు ఉందని, శ్రీశైలం నుంచి నీరు వచ్చినా సాగుకు విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. ఉన్న నీరు 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని చెప్పారు. ఏఎంఆర్‌పీ కూడా సగం మాత్రమే నిండిందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు. రానున్న రోజుల్లో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం దక్షిణ తెలంగాణపై ఎలా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. పంట మార్పిడిలో భాగంగా జిల్లాలో ఇప్పటికే 33 వేల ఎకరాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేశారని, ఈ విస్తీర్ణాన్ని లక్షన్నర ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
భూసారం కాపాడుకోవాలి: ప్రాజెక్టుల కింద వరుసగా రెండు పంటలు వరి సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతింటోందని మంత్రి అన్నారు. అధికంగా ఎరువులు వినియోగించడం, నిరంతర వరి సాగుతో భవిష్యత్తులో ఇతర పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేయడంతోపాటు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా అధికారులు చైతన్యం కల్పించాలని సూచించారు. జిల్లాలోని 9 వేల విద్యుత్ పరివర్తకాలపై అధిక భారం ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన విద్యుత్ సామగ్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు 5 వేల తుంపర సేద్య పరికరాలు అవసరమని అధికారులు కోరగా, వాటిని వెంటనే మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి: నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పనులు కొనసాగుతున్నాయని, ఏఎంఆర్‌పీ, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులకు ఎంతైనా ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. కరువు పరిస్థితుల్లోనూ, శ్రీశైలం ప్రాజెక్టు మృత నిల్వకు చేరినా ఎస్‌ఎల్‌బీసీ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలవాలని, ప్రజల్లో ధైర్యం నింపాలని మంత్రి సూచించారు. ఇకపై జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాలను తరచుగా నిర్వహించాలని ఆదేశించారు.
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు మెట్ట పంటలు సాగు చేసేలా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులను చైతన్యపరచాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేదన్నారు. రానున్న రోజుల్లో ఎగువ నుంచి సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో పంటలు, తాగునీరు, ఇతర అవసరాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లోనూ సూపర్ ఎల్‌నినో ప్రభావం కొనసాగేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దక్షిణ తెలంగాణలో వర్షాలు తక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు మాత్రమే ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పైకప్పులపై వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను ప్రోత్సహించాలని సూచించారు.
సమావేశంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్‌రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, హాలియా, నిడమనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు, భూగర్భ జలాలు, వ్యవసాయం, ఉద్యాన శాఖలు, విద్యుత్ విభాగం, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ప్రస్తుత సాగునీటి పరిస్థితి, పంటల సాగు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై సమావేశానికి వివరాలు సమర్పించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!