తాగునీటికి తొలి ప్రాధాన్యం.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షలో మంత్రుల ఆదేశాలు
చీకటి వెలుగు నల్లగొండ.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్, వ్యవసాయం రంగాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవారం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి రంగాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రైతులు పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షపాత పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలని, వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ జల శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. వరి సాగు చేసిన రైతులకు నష్టం కలగకుండా చూడాలని, సాగునీటి కోసం కొత్తగా బోర్లు వేయడాన్ని నియంత్రించాలని, తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
వరి సాగు వద్దు.. ఆరుతడి పంటల వైపు వెళ్లాలి: ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని, దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.
రైతులు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
బోర్లు వేసినా చివరి వరకు నీరు అందకపోవచ్చని, రైతులు వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, వర్షాలు కురవకపోతే వచ్చే జూలై వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు.
రైతులు కందులు, పెసర్లు వంటి ఆరుతడి పంటల వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రచారం చేయాలని ఆదేశించారు. దేవరకొండ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక అనుసంధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టు ఆరో దశ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు అందిస్తామని, డిండి ప్రాజెక్టు, దున్నపోతుల గండి, బస్వాపూర్ పనులను వేగవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు.
కరువు పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
కరువు పరిస్థితులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎస్ఎల్బీసీ పనులు 600 మీటర్ల మేర పూర్తయ్యాయని, 2028 ఆగస్టు నాటికి ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.
తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉదయ సముద్రం ప్రాజెక్టులో నీటిని నింపాలని, మూసీ నుంచి తిప్పర్తి మండలానికి సాగునీరు విడుదల చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
దేవరకొండ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రామాలకు తక్షణమే నీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.
నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటికే వరి సాగు చేసిన రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే అదనపు విద్యుత్ కోసం ప్రతిపాదనలు పంపాలని, తక్కువ వోల్టేజీ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టులు, విద్యుత్, తాగునీటిపై ఎమ్మెల్యేల సూచనలు
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బస్వాపూర్, మల్లన్నసాగర్ భూసేకరణకు సంబంధించిన రూ.87 కోట్లు విడుదల చేస్తే గంధమళ్ల ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. శామీర్‌పేట వద్ద పెండింగ్‌లో ఉన్న ఐదు కిలోమీటర్ల పనులు పూర్తయితేనే భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు నీరు అందుతుందని చెప్పారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బునియాదిగాని కాలువ భూసేకరణకు నిధులు కేటాయించాలని, దేవాదుల ఆరో దశ ద్వారా నీరు అందించాలని కోరారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ కోతుల బెడద ఇబ్బందిగా మారిందని తెలిపారు. లిఫ్టుల మరమ్మతులు, చెరువుల బలోపేతం, పూడిక తొలగింపు పనులు చేపట్టాలని కోరారు.
కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ డిండి ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరాకు అనుసంధానం ఏర్పాటు చేయాలని, 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం మంజూరు చేయాలని కోరారు.
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి పట్టణానికి తాగునీటి సరఫరా నిరంతరంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పత్తి వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి సరఫరాను మెరుగుపరచాలని, విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసిన రైతులకు వెంటనే సరఫరా కల్పించాలని సూచించారు.
ఎల్‌నినోపై అధికారుల ప్రణాళికలు
సమావేశం ప్రారంభంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా తరఫున ప్రదర్శన ద్వారా వివరించారు.
సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నెల్లికంటి సత్యం, అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యాన, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ జలసిరిపై రూపొందించిన గోడపత్రికను మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఆవిష్కరించారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments