హైదరాబాద్ మహాధర్నాకు నల్గొండ నుంచి భారీగా తరలిన సీపీఎం నాయకులు
చీకటి వెలుగు, నల్లగొండ | జూలై 15
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనేందుకు నల్గొండ పట్టణం నుంచి బయలుదేరిన వాహనాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హశం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను నమ్మి నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని, అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుతం ఆ హామీలను అమలు చేయకుండా మాట తప్పిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నియామకాలకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించిన హశం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఐక్యం చేసి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం, జిల్లా, పట్టణ, మండల నాయకులు ఎం.డి. సలీమ్, దండెంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, నలపరాజు సైదులు, బొల్లు రవీందర్, ఎం. కిరణ్, కండె యాదగిరి, ఎం.డి. ఆదిల్, రాజేష్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments