అనుబంధ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి: ఎంజీయూ రిజిస్ట్రార్‌కు బీసీ విద్యార్థి సంఘం వినతి
చీకటి వెలుగు, నల్లగొండ:
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడలోని అరోరా లీగల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ (లా కాలేజ్) అనుబంధ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్నెపర్తిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డా. కొప్పుల అంజిరెడ్డికి బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోయినా కళాశాలకు అనుమతులు ఎలా లభించాయో ఆశ్చర్యంగా ఉందన్నారు. కళాశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే లా విద్యను అభ్యసిస్తున్నారని ఆరోపించారు.
లా విద్యలో తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పట్టించుకోకుండా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో లేకపోవడం వల్ల విద్యాభ్యాసం దెబ్బతింటోందని పేర్కొన్నారు.
అలాగే అర్హతలు, అనుభవం లేని అధ్యాపకులతో బోధన నిర్వహిస్తున్నారని, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా అధ్యాపకులను నియమించలేదని ఆరోపించారు. అధ్యాపకుల జీతాల చెల్లింపుల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
గతంలో ఇదే కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థి, అదే సమయంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాడని ఆరోపించారు. గవర్నింగ్ బాడీ సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశాలపై మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తక్షణమే విచారణ జరిపి, బీసీఐ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అరోరా లా కాలేజ్ అనుబంధ గుర్తింపును రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో ఎంజీయూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సాగర్ల కరుణాకర్ యాదవ్తో పాటు యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments