చీకటి వెలుగు నల్లగొండ,
ఎస్సీ వర్గీకరణ అమలుతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, పార్లమెంట్‌లో తగిన చట్టపరమైన మార్పులు చేసే వరకు తమ శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ వల్ల దళితుల ఐక్యత దెబ్బతింటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1,108 కులాలకు, తెలుగు రాష్ట్రాల్లోని 59 ఎస్సీ కులాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్ల ఫలితాలు కొద్దిమందికే పరిమితమవుతున్నాయని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం అనేది కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా, దేశ సంపద పంపిణీ, పాలనలో భాగస్వామ్యం, మంత్రి పదవుల కేటాయింపు వంటి అన్ని రంగాల్లోనూ ప్రతిబింబించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే స్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ప్రజల ఐక్య ఉద్యమం ద్వారా ఏ చట్టాన్నైనా పునఃసమీక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం మాల సామాజిక వర్గం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, తమ హక్కులు, ఉనికి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీరం సతీష్ కుమార్, ఈద అంజయ్య, మానే కాశయ్య, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నానీ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments