బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశం
చీకటి వెలుగు నల్లగొండ,
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధి నుంచి వచ్చిన 28 మంది బాధితులు భూ తగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలు, పౌర వివాదాలు, కేసుల దర్యాప్తు పురోగతికి సంబంధించిన అంశాలపై తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ఫిర్యాదుదారుల వాదనలు ఓర్పుగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా మాట్లాడి కేసుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. చట్ట నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వినతిపై పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, ప్రజలకు సత్వర, పారదర్శక, బాధ్యతాయుత పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎస్పీ హెచ్చరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments