ePaper
Tuesday, September 8, 2026

నల్లగొండలో అర్ధరాత్రి పోలీసుల ముమ్మర తనిఖీలు..146 వాహనాల స్వాధీనం, 91 మద్యం మత్తు డ్రైవింగ్ కేసులు

చీకటి వెలుగు నల్లగొండ,

నల్లగొండ పట్టణంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. నేరాల నియంత్రణ, రహదారి భద్రత బలోపేతం, ట్రాఫిక్ నిబంధనల అమలు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని 17 తనిఖీ కేంద్రాల్లో ఏడుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 24 మంది ఉప ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 91 మందిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు ప్రయాణికులతో ద్విచక్ర వాహనాలు నడిపిన 30 మందిపై, మైనర్లతో వాహనాలు నడిపించిన తొమ్మిది మందిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన నాలుగు సైలెన్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 73 వాహనాలను గుర్తించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 97 మంది, వాహనాలకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 81 మందిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టారు. మొత్తం 146 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రల ఆధారంగా వ్యక్తుల వివరాలను గుర్తించే పాపిలాన్ పరికరం ద్వారా ఇద్దరు అనుమానితుల వివరాలను పరిశీలించారు. అలాగే 12 మంది రౌడీషీటర్ల కదలికలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన రెండు నల్లరంగు అద్దపు పొరలను తొలగించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 134 ఎలక్ట్రానిక్ చలాన్లు, ఇతర ఉల్లంఘనలపై 11 చిన్నపాటి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లతో వాహనాలు నడిపించడం, ముగ్గురు ప్రయాణికులతో ద్విచక్ర వాహనాలు నడపడం వంటి చర్యలు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాలో ఇలాంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఉప ఇన్‌స్పెక్టర్లు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!