ePaper
Friday, September 4, 2026

వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.12 లక్షల స్కాలర్‌షిప్‌ల పంపిణీ

చీకటి వెలుగు నల్లగొండ,

వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఫౌండేషన్ కార్యాలయంలో వివిధ తరగతుల్లో ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 41 మంది విద్యార్థులకు సుమారు రూ.12 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రసాద్ అందజేశారు.
ఈ సందర్భంగా రవి ప్రసాద్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
చదువుతో పాటు సంస్కారం, సామాజిక బాధ్యత కూడా అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తమలాంటి విద్యార్థులకు చేయూతనందించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని పట్టుదల, అంకితభావంతో కృషి చేస్తే బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.
వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది స్కాలర్‌షిప్‌లతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సుమారు రూ.80 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను 100 మందికి పైగా విద్యార్థులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి యామా దయాకర్, 48వ డివిజన్ కార్పొరేటర్ యామా కవిత దయాకర్, ఫౌండేషన్ డైరెక్టర్ శరత్‌చంద్ర, మిత్రులు రాఘవాచారి, రవీంద్ర, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!