జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఐఏఎస్ & జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్,
చీకటి వెలుగు నల్లగొండ,
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు 2 కిలోమీటర్ల అవగాహన రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు, ప్రజలతో కలిసి రన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతుందని అన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు లేదా అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.
“డ్రగ్ ఫ్రీ నల్గొండ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ” లక్ష్యంతో నిర్వహించిన ఈ 2కే రన్ ద్వారా యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సైదా బాబు, శివ ప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments