ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై ప్రత్యేక అధికారి డా. గౌరవ్ ఉప్పల్ సమీక్ష

చీకటి వెలుగు, నల్గొండ, జూన్ 24:
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్య సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారునికి సమర్థవంతంగా అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు.
బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్తో కలిసి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం, ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించడం, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడం లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
నల్గొండ జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారి అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారుడిని విస్మరించకూడదని స్పష్టం చేశారు.
అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు కేవలం రొటీన్ విధులకు పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి వినూత్న ఆలోచనలతో ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పథకాల అమలు జరిగితే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో నిధుల కొరత ఉన్నప్పటికీ జిల్లా అధికారులు సమర్థవంతంగా కార్యక్రమాలను నిర్వహించారని ప్రశంసించారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటూ చిన్నచిన్న మరమ్మతుల కోసం జిల్లా కలెక్టర్ ద్వారా డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యార్థులను దోమల బారిన పడకుండా మస్కిటో నెట్లు ఏర్పాటు చేయడం, డోర్లు, కిటికీల మరమ్మతులు వంటి పనులు చేపట్టాలని ఆదేశించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో వివిధ అంశాల వారీగా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం జిల్లా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల పనితీరును వివరించారు.
ప్రత్యేక అధికారి కలెక్టరేట్‌కు చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్తో పాటు ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు.
ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్ఓ దశరథ్, డీఎఫ్‌వో రాజశేఖర్, సీపీఓ శ్రీనివాస్ నాయక్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments