ePaper
Friday, September 4, 2026

ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – కమిషనర్.

చీకటి వెలుగు.నల్లగొండ,

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ, అంటువ్యాధుల నివారణ, ఇందిరమ్మ ఇండ్ల అమలు, ఆస్తి పన్ను వసూళ్లు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నగరంలో డెంగ్యూ, మలేరియా, కలరా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, దోమల వ్యాప్తికి కారణమయ్యే నిల్వ నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

వార్డ్ ఆఫీసర్లు, జవాన్లు, రిసోర్స్ పర్సన్స్, శానిటేషన్ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కాలనీలు, డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నా లేదా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపిక, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన పేదలకు గృహాలు అందేలా చర్యలు చేపట్టాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించారు. అలాగే గతంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవసరమైన మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.32 కోట్ల మేర ఉన్న ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పైప్‌లైన్లు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. TUFIDC నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయడంతో పాటు, కొత్తగా మంజూరైన ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

నగరంలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం కఠినంగా వ్యవహరించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇకపై వారానికొకసారి జరిగే సాధారణ సమీక్షలతో పాటు శాఖల వారీగా ప్రత్యేక సమీక్షలు నిర్వహించి, పెండింగ్ పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కమిషనర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

వర్షాకాలంలో ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, హానికర వ్యర్థాలను విడివిడిగా మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కోసం ఖర్చు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పి. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. అశోక్, అసిస్టెంట్ ఇంజనీర్లు దిలీప్, ప్రవీణ్, అసీం బాబా, శానిటరీ సూపర్వైజర్ జి. శ్రీనివాస్, మేనేజర్ కళ్యాణి, రెవెన్యూ అధికారి శివరాం రెడ్డి, వార్డ్ ఆఫీసర్లు, సెక్షన్ క్లర్కులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!