చీకటి వెలుగు నలగొండ.
“ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏముంది..? దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మా బ్రిడ్జి కల ఎప్పుడు నెరవేరుతుంది..?” అంటూ నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల రైతులు, ప్రజలు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యపై మరోసారి గళమెత్తిన ఇరు గ్రామాల ప్రజలు, రైతులు కాసోజు శంకరాచారి నాయకత్వంలో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాసోజు శంకరాచారి మాట్లాడుతూ, నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల ప్రజలకు కనీస అనుసంధాన బ్రిడ్జి సౌకర్యం లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, అధికారుల పర్యటనలు జరిగినా ప్రజల కష్టాలు మాత్రం మారలేదన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఈ ప్రాంత రైతులు తమ పొలాలకు వెళ్లాలన్నా, పండించిన పంటలను మార్కెట్‌కు తరలించాలన్నా నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. రహదారి లేక రైతుల శ్రమ వృథా అవుతుండగా, పంట దిగుబడులు వచ్చినా సరైన రవాణా సౌకర్యం లేక నష్టాలు చవిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి మాటల్లోనే మిగిలిపోయి, గ్రామీణ ప్రజల ప్రాథమిక అవసరాలు మాత్రం ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందన్నారు. గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వృద్ధులను ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం గంటల తరబడి తిరగాల్సి వస్తోందని తెలిపారు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ విద్యకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. “ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని రైతులు స్పష్టం చేశారు. నేరడ–గాదిరెడ్డిపల్లె మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మాణం కేవలం ఒక అభివృద్ధి పనికాదని, వేలాది మంది ప్రజల జీవనాడిని కలిపే ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని వివరించారు. రైతుల గోడును శ్రద్ధగా విన్న జిల్లా కలెక్టర్ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసినట్లు కాసోజు శంకరాచారి తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో పాటు ఇతర అధికారులను రైతుల సమక్షంలోనే స్థల పరిశీలన నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరలోనే ప్రారంభమవుతాయని కలెక్టర్ భరోసా ఇచ్చారని తెలిపారు. కలెక్టర్ స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ పోరాటానికి ఫలితం దక్కే రోజు దగ్గరపడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి బ్రిడ్జి నిర్మాణం సాధించుకుంటామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మర్ల రాజ్యలక్ష్మి, ఆవుల సైదమ్మ, మంద యశోద, ఆవుల యాదమ్మ, ఆవుల కవిత, వల్లపు పద్మ, వల్లపు సుజాత, చిరుగోని సాలమ్మ, తీగల కృష్ణారావు, తీగల వెంకటరావు, రామగిరి వసంతరావు, మర్ల ఉమారెడ్డి, ఆవుల నరసింహ, ఆవుల శ్రీను, వల్లపు శ్రీశైలం, చిరుగోని మల్లేష్, కడారి శంకర్, వల్లపు వెంకన్నలతో పాటు గ్రామ నాయకులు మర్ల రామ్‌రెడ్డి, గంజి కృష్ణయ్య, సన్యాసిరావు, మంద వేణుగోపాల్‌రెడ్డి, ప్రిన్స్ రమేష్‌బాబు, మిరియాల మురళీకృష్ణ, గంజి గోవర్ధన్, వీరమల్ల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments