ePaper
Wednesday, June 3, 2026

జీవో నెం.7ను బేషరతుగా రద్దు చేయాలి: మేకపోతుల నరేందర్ గౌడ్

నల్గొండ, చీకటి వెలుగు: బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించబోమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ హెచ్చరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

బీసీల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయ, విద్యా, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, వారి హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, జీవో నెం.7ను బేషరతుగా రద్దు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొండ రామకృష్ణంరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం వెంకట మధు, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చొల్లేటి రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త లింగస్వామి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ, జిల్లా నాయకులు దొండ సాంబయ్య, ఉళ్లెందుల అంజయ్య, డబ్బికార్ రాజా, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!