ePaper
Wednesday, June 3, 2026

అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వీరుల త్యాగాల ఫలితంగానే నేటి తెలంగాణ రాష్ట్రం సాకారమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా విప్లవాల పురిటిగడ్డగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని, సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల సాధన కోసం తాను మంత్రి పదవిని సైతం త్యజించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని, నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ధాన్య సేకరణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సాధించిన పురోగతిని వివరిస్తూ, 2025-26 యాసంగి సీజన్‌లో క్వింటాకు రూ.2,389 మద్దతు ధర చెల్లించి, 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం ద్వారా నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు జరగడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖలు రూపొందించిన అభివృద్ధి శకటాలను మంత్రి తిలకించారు.

విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయగా, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.

సంక్షేమ పథకాల పంపిణీ

చండూరు మండలం ఉడతలపల్లి గ్రామానికి చెందిన కొరివి శ్రీదేవి–శివ దంపతులకు ఇందిరమ్మ ఇంటి గృహపత్రాన్ని మంత్రి అందజేశారు. అలాగే మెప్మా ద్వారా లబ్ధిదారులకు రూ.6.46 కోట్ల విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాలు అందజేశారు.

పర్యావరణ వేసవి శిబిరాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జడ్పీహెచ్ఎస్ కట్టంగూరు, టీజీ ఎంఎస్ నిడమనూరు, టీజీ ఎంఎస్ మిర్యాలగూడ విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు.

శాఖల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ

డీఆర్డీఏ, గృహనిర్మాణ, వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ, రవాణా, అగ్నిమాపక శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు, ప్రదర్శన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగార్జునసాగర్ బాలభవన్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పోలీసు సేవా పథకాల లబ్ధిదారులకు కూడా మంత్రి పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!