జిల్లాలో 57.70 లక్షల మొక్కలు నాటే లక్ష్యం.. 60 శాతం పూర్తి
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
చీకటి వెలుగు నల్గొండ,
వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా 800 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవం కింద జిల్లాలో ఈ ఏడాది 57.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీల పరిధిలో మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఖాళీ స్థలం ఉన్న ప్రతి ప్రాంతంలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల తుంపర వర్షాలు కురుస్తున్నందున వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంతోపాటు నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించి సంరక్షించాలని సూచించారు. మొక్కలకు నీరు అందించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని తెలిపారు. అవసరమైతే ఉపాధి హామీ పథకం కింద కాపలాదారులను ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. రమేష్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, అటవీశాఖ పరిధి అధికారి రవీందర్, ఉపసర్పంచ్ జే.కే. సతీష్, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు గుమ్మల మోహన్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments