హైదరాబాద్ వెళ్లకుండానే సమస్యల పరిష్కారం.. జిల్లా ప్రజలకు అందుబాటులోకి సేవలు
చీకటి వెలుగు నల్లగొండ
ఆధార్‌లో మార్పులు, చేర్పులు, ఇతర సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో కొత్తగా ఆధార్ సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. నల్గొండ–హైదరాబాద్ రహదారిలోని పద్మానగర్, పాల కేంద్రం వద్ద కేంద్ర యూఐడీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధార్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారిందన్నారు. ఆధార్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నల్గొండలోనే సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. తెలంగాణలో ఇది ఐదో ఆధార్ సేవా కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలతోపాటు నల్గొండ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రం ఆదివారం కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో వందేళ్లు పైబడిన వారు సుమారు 200 మంది ఉన్నట్లు కలెక్టర్ ద్వారా తెలిసిందని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరి పుట్టిన తేదీల్లో తప్పులు నమోదయ్యాయని, సంబంధిత తహసీల్దార్ల ద్వారా వారిని నల్గొండ ఆధార్ సేవా కేంద్రానికి తీసుకొచ్చి వయసు, పుట్టిన తేదీ వివరాలను సరిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పైసా అదనపు ఖర్చు లేకుండా, హైదరాబాద్ వెళ్లే ఇబ్బంది లేకుండా ఆధార్ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే అవకాశం లభించిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆధార్‌లో తప్పులు ఉంటే హైదరాబాద్‌కు వెళ్లకుండా నల్గొండలోని సేవా కేంద్రంలోనే నిర్దేశిత రుసుము చెల్లించి సవరణలు చేసుకోవచ్చన్నారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు ఆధార్ నమోదుకు ఈ కేంద్రంలో అవకాశం ఉందని తెలిపారు. నిర్ణీత పనిదినాలు, వేళల్లో కేంద్రం పనిచేస్తుందని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఈడీఎం దుర్గారావు, యూఐడీఐ ఆధార్ సేవా కేంద్రం సంస్థ ప్రతినిధులు డైరెక్టర్ భారతి, మేనేజర్ హరినాథ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments