విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
చీకటి వెలుగు నల్లగొండ.
బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాల పరిస్థితిని పరిశీలిస్తూ విద్యార్థుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు రక్షణ, విద్యా అభివృద్ధికి కేంద్రాలుగా ఉండాల్సిన చోట ప్రస్తుతం సమస్యల నిలయాలుగా మారడం అత్యంత ఆందోళనకరమని అన్నారు.
వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం, తాగునీటి సమస్య, పరిశుభ్రత లోపించడం, దోమలు, ఎలుకల బెడద అధికంగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని వసతి గృహంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర సంక్షేమ వసతి గృహాల పరిస్థితి ఎలా ఉందో అధికారులు వెంటనే పరిశీలించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంక్షేమ శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి వారం ఒక సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫాంలు అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సగం విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పుస్తకాలు పంపిణీ చేయడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
అందువల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు తక్షణమే నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేయాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ సంక్షేమ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. జిల్లా మంత్రి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ వసతి గృహానికి తగిన స్థలాన్ని కేటాయించి, ఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన భవనాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొగాకు రవి కుమార్ యాదవ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు మల్లబోయిన తరుణ్ కుమార్ యాదవ్, సకినాల రమేష్ ,పృథ్వీరాజ్, ప్రభాకర్, మల్లేష్ ,నరేష్ ,హరికృష్ణ ,నగేష్ ,మురళీధర్, పరమేష్ ,ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments