చీకటి వెలుగు నల్లగొండ,
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం మరియు దానికి అనుబంధంగా జారీ చేసిన జీఓల కారణంగా మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ప్రతినిధి బృందం శనివారం నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమల్లో ఉన్న షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం–2025 (చట్టం 15/2025)తో పాటు ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms. No. 9, 10, 99 వల్ల మాల మరియు దాని 25 ఉపకులాలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. సమాన సామాజిక న్యాయం పేరుతో అమలు చేస్తున్న ఈ విధానం ఆచరణలో మాల యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 100 పాయింట్ల రోస్టర్ విధానంలో ప్రారంభ దశలోనే ఉద్యోగ అవకాశాలు లభించే రోస్టర్ పాయింట్లలో మాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రూప్–IIIలో తొలి రోస్టర్ పాయింట్‌ను 22వ స్థానంలో కేటాయించడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. అనంతరం 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లలో మాత్రమే అవకాశం కల్పించడం వల్ల తక్కువ పోస్టులతో వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. పోలీస్ శాఖ నియామకాలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో 5 నుంచి 15 పోస్టుల మధ్య వెలువడే నోటిఫికేషన్లలో మాల అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(4), 16(4)లలో పొందుపరిచిన సమాన అవకాశాల స్ఫూర్తికి విరుద్ధమని, ఆచరణలో “రివర్స్ డిస్క్రిమినేషన్”కు దారితీస్తోందని పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీఓలను తక్షణమే రద్దు చేయాలని, రోస్టర్ పాయింట్లను పునఃపరిశీలించి గ్రూప్–IIIలో 1 నుంచి 16 రోస్టర్ పాయింట్లలోపే మాల సామాజిక వర్గానికి కనీసం రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని, రోస్టర్ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని వారు వినతిపత్రంలో డిమాండ్ చేశారు. ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాల మహానాడు ప్రతినిధులు కోరారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో చింతపల్లి లింగమయ్య (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), ఎన్నమల్ల అనిల్ (రాష్ట్ర కార్యదర్శి), చింతపల్లి బాలకృష్ణ (రాష్ట్ర ఉపాధ్యక్షులు), చిలుకూరి అభినవ్ (రాష్ట్ర కమిటీ సభ్యుడు), చింతపల్లి వెంకన్న (విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి), అనుముల పూరి సుధాకర్ (జిల్లా నాయకుడు), రావిరాల వరప్రసాద్ (జిల్లా నాయకుడు), బోగరి రవీందర్ (జిల్లా ఉపాధ్యక్షుడు), ఎర్రమళ్ల ప్రభాకర్ తదితర నాయకులతో పాటు మాల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments