ePaper
Friday, September 4, 2026

పిఆర్సీ ప్రకటించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి.

చీకటి వెలుగు నల్లగొండ.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పీఆర్సీని ప్రకటించి ఆరు కరవుభత్యాలు (డీఏలు), పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
పీఆర్సీ నివేదికను ఆలస్యం చేయకుండా స్వీకరించి 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని వారు అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించి, భవిష్యత్తులో బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరు కరవుభత్యాల ప్రకటనలో జాప్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఆలస్యం చేయకుండా అందించాలని డిమాండ్ చేశారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సమగ్ర శిక్ష అభియాన్ మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందికి సమ్మె కాలపు వేతనాలు చెల్లించి, బహుళ విధుల విధానాన్ని అమలు చేయాలని కోరారు. నమూనా పాఠశాలల ‘010’ పద్దుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, జీవో 190 అమలును విద్యాశాఖలో కూడా పూర్తి చేసి అప్పీలు చేసిన వారందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికల హామీ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గురుకులాలు, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సేవలో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ అర్హతలో 40 శాతం మార్కులను ప్రమాణంగా నిర్ణయించాలని, 2008 డీఎస్సీ ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల ఆరోగ్య కార్డుల అమలుపై స్పష్టత ఇవ్వకుండానే వేతనాల నుంచి వాటా కోత విధించడం సరికాదన్నారు. ఉమ్మడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ట్రస్ట్‌లో స్థానం కల్పించి, మార్గదర్శకాలు ఖరారైన తర్వాతే వాటా కోత అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు జూలై తొలి వారంలోనే నిధులు విడుదల చేయడంతో పాటు, ఉపాధ్యాయుల వార్షిక పదోన్నతులు, బదిలీల క్యాలెండర్‌ను ప్రకటించాలని కోరారు.
ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపకపోతే ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ధర్నాలో తపస్ రాష్ట్ర నాయకులు ఇరుగు శ్రీరామ్, విజయ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, జిల్లా, మండలాల నాయకులతో పాటు పెన్షనర్ల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు బిక్షపతి, గణేష్, రామకృష్ణారెడ్డి, 2003 డీఎస్సీ పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు నూనెముంతల లక్ష్మీనారాయణ, దండేపల్లి లక్ష్మీనారాయణ, బీసీటీయూ నాయకులు కొన్నె శంకర్ గౌడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!